ఆర్.ఎస్.ఎస్.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
అది 1965 భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయం శత్రు సైన్యాలు శ్రీనగర్ లోకి చొరబడుతున్నాయి.నగరాన్ని చాలా వేగంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.కాశ్మీర్ కి సత్వరమే సైనిక సహాయం కావాల్సి వచ్చింది. అదే సమయంలో ఢిల్లీలోని ఆర్మీ ఆఫీస్ నుండి శ్రీనగర్ కి సందేశం వచ్చింది.మొత్తం శ్రీనగర్ శత్రువుల చేతిలోకి వెళ్ళినా పర్లేదు.కానీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ని మాత్రం శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడండి అని అక్కడ ఉన్న సైనికులకు చెప్పారు.సైనికులు విమానాల ద్వారా ఏ సమయంలోనైనా శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు.ఇది ఆ సందేశ సారాంశం.కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది.శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మొత్తం మంచుతో కప్పబడిపోయింది.అక్కడ విమానం దిగడం అనేది దాదాపు అసాధ్యం.అప్పటికప్పుడు కూలీల్ని పెడదామన్నా?ఆ రాత్రి వేళ అంత మంది కూలీలు దొరకలేదు.సమయం చూస్తే అర్ధరాత్రి 11 గంటలు.
అప్పుడు సైన్యాధికారులకు వెంటనే గుర్తొచ్చిన సంస్థ ఆర్.ఎస్.ఎస్. వెంటనే ఆర్మీ వాహనం సంఘ్ ఆఫీస్ ముందు ఆగింది.
అందులో నుండి ఆర్మీ ఆఫీసర్ ప్రేమ్ నాథ్ డోగ్రా దిగి, సరాసరి సంఘ్ ఆఫీస్ లోకి వెళ్లి, అర్జున్ కి విషయం చెప్పి,మంచు తొలగించడానికి వాలంటీర్స్ ని పంపగలరా అనడిగారు.అర్జున్ ఎంతమంది కావాలనడిగారు.ఒక యాభై మంది ఉంటే ఎంతోకొంత విమానాలు దిగడానికి క్లియర్ చేయవచ్చన్నారు డోగ్రా.అర్జున్ సమాధానంగా ఆరువందల మంది వస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు.
ఏంటీ..?ఇంత రాత్రి వేళ అంతమందా? ఆశ్చర్యపోయాడు ఆర్మీ ఆఫీసర్.
మీరు వాహనాలు సిద్ధం చేయండి.నలభై ఐదు నిముషాల్లో మా వాళ్ళు వస్తారు అని సమాధానం ఇచ్చారు అర్జున్.కాసేపట్లోనే 600 మంది వాలంటీర్లు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.అక్కడ నుండి అందరూ ఎయిర్ పోర్ట్ చేరుకుని అందరూ కలిసి రాత్రంతా పని చేసి మంచుని తొలగించారు.తర్వాత రోజు ఉదయానికి ఎనిమిది విమానాల్లో 329 మంది సిక్కు రెజిమెంట్ సైనికులు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. వాళ్ళంతా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను ప్రేమతో మెచ్చుకున్నారు.తర్వాత విమానాల నుండి ఆయుధాలను చేరవేయడానికి ఆ సైనికులకు వాలంటీర్లు సహాయపడ్డారు.అలా ఆ రోజు సైనికులు శ్రీనగర్ కి చేరుకోడానికి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు సహాయపడ్డారు.
ఇది ఒక్కటే కాదు,
1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం లో కూడా గాయపడిన సైనికులకు సహాయ సహకారాలు అందించడానికి, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చింది కూడా ఆర్.ఎస్.ఎస్. వాలంటీర్లే.ఈ విషయం లో నెహ్రూ తర్వాత సంవత్సరం గణతంత్ర దినోత్సవం పరేడ్ లో పాల్గొనమని ఆహ్వానించారు,లాల్ బహదూర్ శాస్త్రి, ఆర్మీ జనరల్ కుష్వంత్ సింగ్ గార్లు కూడా మెచ్చుకున్నారు.
1954 ఆగస్టు 2న దాద్రా మరియు హవేలీ నగరాలను వీరోచితంగా విముక్తి చేసింది కూడా ఆర్.ఎస్.ఎస్. వాళ్ళే.
1947 ఆగస్టు 15న దేశం మొత్తం స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, ఫ్రెంచి ఆక్రమణలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇంకా బానిసత్వం లో మగ్గిపోతూ, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.వాటిలో ఈ రెండు నగరాలు ఉన్నాయి.ఆ ప్రజల పైన జాలితో ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు ఎలా అయినా విముక్తి చేయాలనుకున్నారు.లతా మంగేష్కర్ లాంటి గాయకులతో కచేరీలు ఏర్పాటు చేసి, వచ్చిన డబ్బులతో ఆయుధాలు కొనుక్కుని, ఒక వైపు తుఫాను భీభత్సం సృష్టిస్తుంటే,ఆ తుఫాను లో మరో తుఫాను లా 116 మంది పరాక్రమవంతమైన కరసేవకులు విముక్తి వాహిని అనే పేరుతో దాద్రా హవేలి వైపు దూసుకు పోయారు.తుఫానులో ఆయుధాలతో దూసుకువస్తున్న కార్యకర్తలను చూసి ఫ్రెంచి ఆర్మీ ఆయుధాలను పడేసి పారిపోయారు. చిన్న ఘర్షణలు ఏర్పడినప్పటికీ, ఊరూరా తిరుగుతూ స్వాతంత్ర్యం ప్రకటిస్తూ జాతీయ జెండాలు ఎగరేసి,ఆ నగరాలకి,గ్రామాలకి ఉదయానికల్లా పూర్తి స్వాతంత్ర్యం సాధించి పెట్టారు.
దేశంలో ఎక్కడ,ఏ మూల,ఏ ప్రమాదం జరిగినా,ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా వెంటనే ఒక తెల్ల చొక్కా,ఖాఖీ నిక్కరు లేదా ప్యాంటు వేసుకుని, విరాళాలు సేకరించి, సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళిపోతారు. కులం, మతం, ప్రాంతం, వర్గం ఏ తారతమ్యం చూడకుండా, బాధితులకు సహాయం చేస్తూ అండగా నిలబడతారు.సంఘ్ లో చెప్పేదే అది.భరతమాత ఔన్నత్యం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడు,బాధితుల సేవ కోసం రేయింబవళ్ళు కష్టపడు.
ఇంత గొప్ప సంస్థ చరిత్ర ఏంటి?

డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ గారు ఆ రోజుల్లో డాక్టర్ గా పని చేసేవారు.అలాగే దేశ స్వాతంత్య్రం కోసం ఆలోచిస్తూ కాంగ్రెస్ లాంటి పార్టీల సమావేశాల్లో పాల్గొనేవారు.కానీ ఇంత గొప్ప విజ్ఞాన దేశం, బలమైన దేశం అసలు స్వాతంత్ర్యాన్ని ఎలా కోల్పోయింది అని ఆలోచించినప్పుడు ఆయన తెలుసుకున్న విషయం మన దేశ నాయకులు,ప్రజలు సంఘటితంగా లేకపోవడం వల్లనే మన దేశం స్వాతంత్ర్యం కోల్పోయింది అని.అప్పుడే దేశం మొత్తాన్ని సంఘటితం చేయాలనుకున్నారు. అందుకే తన వైద్య వృత్తిని వదిలేసి,1925 అక్టోబర్ విజయదశమి రోజున నాగపూర్ లో ఐదుగురు పిల్లలతో సంఘ్ ని ఏర్పాటు చేశారు.మొదట్లో వైద్య వృత్తిని వదిలి,పిల్లలతో తిరుగుతున్నారని కొంతమంది గేలి చేసేవారు. కానీ ఈ రోజు ఈ సంస్థ 46 దేశాల్లో విస్తరించి, ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా పని చేస్తుంది.
అసలు ఆర్.ఎస్.ఎస్. లో ఏం నేర్పిస్తారు?వారి శిక్షణ ఎలా ఉంటుంది?
ప్రతిరోజూ శాఖ జరుగుతుంది.శాఖ జరిగే సమయానికి ఐదు నిమిషాలు ముందుగానే తెల్ల చొక్కా, ఖాఖీ ప్యాంటు వేసుకుని,శాఖ జరిగే ప్రదేశానికి వచ్చేస్తారు కార్యకర్తలు.
సంఘ ప్రముఖ్ చెప్పినట్టుగా చేస్తూ వరుసలో నిలబడి, ముందుగా నమస్తే సదా వత్సలే మాతృభూమె అంటూ భగ ధ్వజానికి,మన మాతృభూమి భరత మాతకు ప్రణామం చేస్తారు.తర్వాత శరీర ధారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం వ్యాయామాలు, యోగా, ధ్యానం చేస్తారు. ఆత్మ రక్షణ కోసం కర్రసాము,నియుద్ధ అంటే కరాటే,నాన్ చాక్ లాంటి కళలను నేర్చుకుంటారు.తర్వాత ఆటలు ఉంటాయి. ఆటలు అంటే కేవలం సరదా కోసం ఆడేవి కాదు,సమైక్యతలోని బలాన్ని తెలియజెప్పేలా ఉంటాయి.ఆటల్లోని ఆనందం కూడా ఉంటుంది.అలసిపోయిన తర్వాత కూర్చుని, ప్రతి నెలా ఆర్.ఎస్.ఎస్. లో ప్రచురితమైన దేశ భక్తి గీతాలు ఆలపిస్తారు. గొప్ప గొప్ప దేశ భక్తుల గురించి, వారి త్యాగాల గురించి క్లుప్తంగా వివరిస్తారు,ఎవరు ఏ పని చేసినప్పటికీ, దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్ని పనులు పక్కన పెట్టేసి సమస్య దగ్గరకు వెళ్ళి బాధితులకు అండగా నిలబడాలి.
ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు కూడా దేశ నాయకుల గురించి,దేశ భక్తి గురించి వివరిస్తూ ఉంటారు.అలాగే వ్యక్తిగతంగా కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించాలనీ, కుటుంబాన్ని బాధ్యత గా చూసుకోవాలని సూచిస్తారు.ఇంట్లో, సమాజంలో పెద్దల్ని గౌరవించాలనీ,అతిథులకు మర్యాదలు చేయాలనీ చెప్తారు.
కార్యకర్తలు రెండు విధాలుగా పని చేస్తారు. ప్రచారక్,గృహస్థు.ప్రచారక్ అంటే లౌకిక జీవనాన్ని వదిలేసి, సంస్థకి అంకితమైపోయి పని చేస్తారు. గృహస్థు కుటుంబ జీవనాన్ని గడుపుతూనే సంఘ్ చెప్పినట్టుగా దేశం కోసం పని చేస్తారు.
సంవత్సరం లో కొన్ని సార్లు ట్రయినింగ్ క్యాంపులు నిర్వహిస్తారు.అక్కడ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో ఉదయమే లేచి,తన పనులు తాను చేసుకుంటూ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ట్రయినింగ్ తీసుకుంటారు.ఈ క్యాంపుల ముఖ్య ఉద్దేశం వ్యక్తి నిర్మాణం.అంటే ఒక వ్యక్తి లో క్రమశిక్షణ, ఆదర్శవంతమైన జీవితాన్ని అలవాటు చేయడం.ఇవి నాలుగు దశల్లో ఉంటాయి.ప్రాథమిక,ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష అనే దశల్లో ఉంటాయి.
ఆర్.ఎస్.ఎస్.లో ఆరు పండుగలు జరుపుకుంటారు.అవి
1. హిందూ సామ్రాజ్య దినోత్సవం
ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని,మన దేశాన్ని విదేశీయులు ఆక్రమణ నుండి కాపాడాడు కాబట్టి,ఆయన పట్టాభిషేక దినోత్సవం.
2.గురు పూజోత్సవం
దేశ ఔన్నత్యానికి, హిందూ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిన భగ ధ్వజాన్ని గురువు గా భావించి గురు పూజోత్సవం జరుపుకుంటారు.
3.రక్షా బంధన్
కార్యకర్తలు అందరూ రాఖీ కట్టుకుంటూ నేను నీకు రక్ష,నీవు నాకు రక్ష, మనిద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్ష అని చెప్పుకుంటారు.
4.విజయదశమి
శక్తిని ఆరాధించే దినోత్సవం,ఆరోజే ఆర్.ఎస్.ఎస్. ప్రారంభించిన దినోత్సవం కూడా.
5.మకర సంక్రాంతి
మకర సంక్రమణం జరిగి వెలుగులు విరజిమ్మే రోజు.సూర్యమానం ప్రకారం జరుపుకునే ఏకైక పండుగ.
6.ఉగాది
యుగం ప్రారంభమైన రోజు.సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ జీ పుట్టిన రోజు కూడా.సంవత్సరంలో ఒక్కసారి ఆయన్ని పూజిస్తాం.
ఇలా వ్యక్తి నిర్మాణం కోసం,సమాజం కోసం, దేశం కోసం,దేశ రక్షణ కోసం,దేశ ఔన్నత్యం కోసం, భరతమాతను విశ్వ గురువుగా చేయాలనే సంకల్పంతో పని చేస్తుంది కాబట్టే ఈ దేశానికి ఇద్దరు నిజాయితీ పరులైన,దేశ భక్తులైన ప్రథాన మంత్రుల్ని ఇవ్వగలిగింది ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు నిజాయితీగా, అవినీతి మచ్చ లేకుండా పని చేయడమే కాదు, దేశాన్ని రక్షణ రంగంలోనూ, అభివృద్ధి పథంలోనూ ముందుకు తీసుకువెళ్ళారు.
ఒకవేళ ప్రథాన మంత్రే ఆర్.ఎస్.ఎస్. కార్యాలయానికి వచ్చినా కానీ అందరితో సమానంగా కూర్చోవాలే తప్ప, ఎవ్వరికీ ప్రత్యేక మర్యాదలు ఉండవు.
ఇది ఆర్.ఎస్.ఎస్. గురించి కొంత సమాచారం.
0 $type={blogger}