గుజరాత్ అల్లర్లు మోడీ భాగస్వామ్యం
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
గుజరాత్ అల్లర్ల పైన నరేంద్ర మోడీ ని నిందుతుడిగా చూపిస్తూ బిబిసి డాక్యుమెంటరీ చేసి కొన్ని యూనివర్సిటీ ల్లో ప్రదర్శించింది.కానీ భారత ప్రభుత్వం కేవలం భారత ప్రభుత్వం మరియు మోడీ పరువు తీయడానికి మాత్రమే ఏ మాత్రం ఆధారాలు లేని,నిరూపించలేని ఇటువంటి ప్రచారం చేస్తుందంటూ ఆ వీడియోలను బ్యాన్ చేసింది.ఆ వీడియోల్లో ఏముందో నాక్కూడా తెలియదు.కానీ అసలు గుజరాత్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
మనం ఈ విషయం గురించి జరిగిన చోట మాత్రమే మాట్లాడుకుంటే మనకి పూర్తి వివరాలు తెలియవు.ఈ సంఘటనకి అయోధ్య లో రామజన్మ భూమి గురించి జరిగిన గొడవల దగ్గర పునాది పడింది.
ఎన్నో సంవత్సరాలుగా రామజన్మ భూమి గురించి హిందువులు పోరాడిన తర్వాత 1992 డిసెంబర్ 6న పి.వి.నర్శింహారావు గారు ప్రధాన మంత్రిగా , కళ్యాణ్ సింగ్ గారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ మరికొన్ని సంస్థలకు చెందిన వేలాది మంది హిందువులు సమూహం గా వెళ్లి ఆగ్రహావేశాలతో ఆ వివాదాస్పదమైన బాబ్రీ మసీదును పూర్తిగా కూల్చేసారు.రెండు వర్గాల వారు ఆ స్థలాన్ని తమకు చెందినదిగా చెప్పుకుంటూ కోర్టులో కేసు వేశారు.
2001 జూన్ లో శ్రీరామ మందిర నిర్మాణ సమితి ఢిల్లీ లో నిర్వహించిన సభలో ప్రజలను ఒప్పించడానికి ప్రజా ప్రతినిధులందర్నీ కలవాలని, వారికి శ్రీరామ జన్మభూమిని గురించిన వాస్తవాలన్నీ తెలియజేసి ఒప్పించాలనీ నిర్ణయించుకున్నారు.అప్పటి ప్రధాన మంత్రి వాజ్పాయ్ గారు ఈ విషయం లో మార్చి 12లోగా ఏదో ఒక పరిష్కారం కనుక్కుందామని అక్టోబర్ 10న పూజ్య మహంత్ పరమహంస దాస్ గారిని ఢిల్లీ లో కలిసినప్పుడు మీడియా తో చెప్పారు.
అక్టోబర్ 17న శ్రీరామ్ లల్లాకు దర్శనం కల్పించాలని లక్నో బెంచ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానిని అనుమతించలేదు.అశోక్ సింఘాల్ మరియు శ్రీస్ఛంద్ర దీక్షిత్ లు బారీకేడ్ నుండి కొన్ని అడుగుల లోపలికి వెళ్ళి గర్భగుడి వెలుపల నుండి స్పష్టమైన దర్శనం చేసుకోవడం నేరంగా పరిగణించబడింది.
జనవరి 26,2002న అయోధ్య నుండి లక్నో, కాన్పూర్ మీదుగా సాధువుల యాత్ర నిర్వహించారు.6500 మంది సాధువులు ఈ యాత్ర లో పాల్గొన్నారు.27న ఢిల్లీ లోని రాంలీలా మైదాన్ లో ఒక పెద్ద ధర్మ సభ నిర్వహించారు.మధ్యాహ్నం 12 గంటలకు సాధువుల బృందానికి ప్రతినిధులు ప్రధాన మంత్రిని కలిసారు.కానీ మార్చి 12 లోగా అని తాను మాట ఇవ్వలేదని ఆయన చెప్పారు.
పూజ్య మహంత్ పరమహంస రామచంద్ర దాస్ గారు తాను శ్రీరామ మందిర నిర్మాణం కోసం చెక్కిన శిల్పాలు క్రేన్ల ద్వారా తీసుకుని వస్తానని చెప్పారు.అంతేకాకుండా ఆ వివాద స్థలాన్ని న్యాస్ కి ఇవ్వవలసిందిగా ఆయన ప్రధాన మంత్రికి లేఖ రాశారు.
అయోధ్య లోని రాంఘాట్ వద్ద ఫిబ్రవరి 17,2002న శ్రీరామ మహాయజ్ఞం మొదలైంది.ఇది 24వ తారీఖు వరకు కొనసాగింది.24వ తారీఖున పూర్ణాహుతి మహాయజ్ఞానికి 8000 మంది రామసేవకులు హాజరు కావాలని కోరారు.25వ తారీఖున 6000 మంది భక్తులు మరియు కర సేవకులు హాజరయ్యారు.
25వ తారీఖున దాదాపుగా 1600 మంది భక్తులు మరియు కర సేవకులు అహ్మదాబాద్ కి వెళ్ళే సబర్మతీ ఎక్స్ప్రెస్ ఎక్కారు.అది 27వ తారీఖున 4 గంటలు ఆలస్యంగా ఉదయం 7 గంటల 43 నిమిషాలకు గోద్రా స్టేషన్ లో ఆగింది.ఆ సమయంలో కొంత మంది కర సేవకులకు మరియు స్టేషన్ లోని వ్యాపారులకు గొడవ అయ్యింది.అయితే కాసేపటికి ఆ గొడవ ఆగిపోయింది.
రైలు ప్లాట్ ఫాం పై నుండి బయలుదేరిన కాసేపటికి ఎవరో ఎమర్జెన్సీ చైన్ లాగారు.దాంతో ఫలియా ఏరియాలోని సిగ్నల్ పాయింట్ దగ్గర రైలు ఆగిపోయింది.ఆ రైలు డ్రైవర్ చెప్పిన మాటల ప్రకారం తమ దగ్గర ఉన్న పరికరాలలో ఆ ఎమర్జెన్సీ చైన్ ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు లాగినట్టు వారికి సందేశం అందింది.
రైలు ఆగిన కాసేపటికి రైలుని రెండు వేల మంది ఉన్న ముస్లిం మూకలు రైలుని చుట్టుముట్టాయి.వాళ్ళు ముందుగా రైలు పైకి విచ్చలవిడిగా రాళ్ళని విసిరారు.తర్వాత కాసేపటికి రైలు యొక్క నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి.ఆ బోగీలోని రామ భక్తులు బయటకి రావడానికి ప్రయత్నించినా దానికి వీలు లేకుండా తలుపులు బయట నుండి ఎవరో మూసేసి బంధించేసారు.
ఆ బోగీల్లో ఉన్న రామ భక్తులు అందరూ పెద్ద వాళ్ళే కాకుండా ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో సహా అందరూ చూస్తూ ఉండగానే బయటకి రావడానికి ప్రయత్నిస్తూ, భయంతో కేకలు వేస్తూ ఆ మంటల్లో శరీరం మొత్తం కాలి నరకయాతన అనుభవించి మరణించారు.సజీవ దహనమయ్యారు.మొత్తం 59 మంది ఆ మంటల్లో కాలి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.ఇందులో 27 మంది మహిళలు,10 మంది చిన్న పిల్లలు ఉన్నారు.మరొక 48 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
కొంత మంది వాదన ప్రకారం ఈ సంఘటన పాకిస్థాన్ నుండి ఇక్కడ దాడి చేసిన వారికి అందిన ఆదేశాలతోనే చాలా పకడ్బందీ పథకం ప్రకారం జరిగిందని అంటారు.గుజరాత్ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కోచ్ లోకి దాడి చేసిన వారు మండే ద్రవాలను విసరడం వల్ల ఈ సంఘటన జరిగింది.అలాగే మంటలు మాత్రం ఖచ్చితంగా బోగీల లోపలి నుండే అంటుకున్నాయి.అందుకే బోగీల బయట కిటికీల కింద బూడిద చాలా తక్కువ ఉంది.
గుజరాత్ పోలీసుల నివేదిక ప్రకారం ఆ ఏరియాలోని మత గురువు మౌల్వీ హుస్సేన్ హజీ ఇబ్రహీం ఉమర్జీ మరియు విధుల నుండి తొలగించబడిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్ నానుమియన్ ప్రధాన సూత్రధారులు మరియు ఫోరెన్సిక్ నివేదికలో చెప్పినట్టుగా ఈ దాడిలో ఉపయోగించిన మండే గుణం కలిగిన ద్రవం 140 లీటర్ల పెట్రోల్ ని రైలు రావడానికి కొన్ని గంటల ముందు కొని మరొక కీలక కుట్రదారుడు రజాక్ కుర్కూర్ గెస్ట్ హౌస్ లో దాచారు.ఈ దాడి లో అనేక వేల మంది ముస్లిం లు పాల్గొన్నారు.
కానీ సుప్రీం కోర్టు జడ్జి గా పని చేసిన ఉమేష్ చంద్ర ఛటర్జీ ఇచ్చిన దర్యాప్తు నివేదికలో మాత్రం ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే అని తెలిపారు.
రైలు దగ్ధమైన ఒకరోజు తర్వాత విశ్వ హిందూ పరిషత్ గుజరాత్ లో రాష్ట్ర వ్యాప్త బంద్ ని ప్రకటించారు.సుప్రీం కోర్టు ఇటువంటి బంద్ లు చట్టానికి వ్యతిరేకమైనవిగా పేర్కొంది.కానీ రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ బంద్ కి అనుకూలంగా మాట్లాడారు.దాంతో ఆ రిజు బంద్ ని నిర్వహించడానికి వారికి దారి సుగమం అయింది.అంతేకాదు ఆ రోజు బంద్ లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది హిందువులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు.అసలు ఊహించనంత మంది జనం ఆరోజు ఆ బంద్ లో పాల్గొన్నారు.
అయితే వారంతా ముందు రోజు హిందువులను సజీవ దహనం చేసారనే కోపం తో రగిలిపోతున్నారు.ఒక వర్గం పైన ఇలా దాడి చేసి స్త్రీలు, చిన్న పిల్లలలతో సహా చంపేయడం అనేది వాళ్ళలో ఆగ్రహావేశాలు పెరిగేలా చేసింది.అదీకాక ఇది హిందువుల పైన దాడులు చేయడానికి పాకిస్థాన్ నుండి అందిన ఆదేశాలతోనే ఇక్కడ ముస్లిం నాయకులు తమ అనుచరులతో కలిసి చేసారనీ, కొంత మంది ముస్లిం లు హిందూ మహిళలను అపహరించి మానభంగం చేసారనీ వార్తలు ప్రచారం అయ్యాయి.అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇది మత ఘర్షణ కాదనీ, ఉగ్రవాద చర్య అనీ పేర్కొన్నారు.ఈ వార్తలన్నీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.

వీటన్నిటి కారణాలతో బంద్ లో పాల్గొన్న హిందువులలో కోపం కట్టలు తెంచుకుంది.ఒక్క సారిగా బంద్ హింసాత్మకంగా మారింది.చాలా మంది హిందువులు ముస్లిం ల పైన దాడులు చేయడం మొదలుపెట్టారు.అంతేకాక ట్రక్కులలో తలకి కాషాయ రిబ్బన్లు కట్టుకున్న కొంత మంది ముస్లిం లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళి వారి పైన దాడులు చేయడం మొదలుపెట్టారు.ముస్లిం ఇళ్ళ పైన,షాపుల పైన దాడి చేస్తూ మధ్యలో ఉన్న హిందువుల ఇళ్ళ పైన మాత్రం ఏ మాత్రం దాడి చేయకుండా తమ దాడులు కొనసాగించారు.
వారి చేతిలో ఓటర్ల జాబితా కూడా ఉందని బాధితులు తెలిపారు.కొంత మంది వాదన ప్రకారం ముస్లింల వివరాలు ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగమే దాడి చేసే వారికి ఈ ముస్లింల సమాచారాన్ని అందించారని అంటారు.అంతేకాక ఆందోళనకారులు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఈ దాడులు చేసారనీ, పోలీసులకు ఫోన్ చేసినా రక్షణ కల్పించడానికి జాప్యం చేసారనీ కొంత మంది తెలిపారు.
28వ తారీఖున సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా దాడులను ఆపడానికి 27 పట్టణాలలో కర్ఫ్యూ విధించారు.సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.డి.ఆంథానీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇక ఈ దాడులు కొనసాగడానికి వీల్లేదనీ,కఠిన చర్యలు తీసుకోవాలనీ,అవసరం అయితే ఇండియన్ ఆర్మీ ని రంగంలోకి దించాలని పోలీసులకు తెలిపారు.చివరికి ఎవరైనా ఇంకా ఆందోళనకు దిగితే చంపడానికి కూడా వెనకాడవద్దని తెలిపారు.
ఒక అంచనా ప్రకారం 230 మసీదులు, 274 దర్గాలు,19 ఆలయాలు,3 చర్చిలు కూల్చివేయబడ్డాయి.100000 ఇళ్ళు,1100 హోటళ్ళు,15000 వ్యాపారాలు,3000 హస్తకళా తయారీ సంస్థలు,5000 వాహనాలు నష్టపోయాయి.200 మంది వరకు పోలీసులు కూడా ఈ గొడవలు ఆపడానికి ప్రయత్నాల్లో మరణించారు.250 మంది మహిళల పైన అత్యాచారాలు జరిగాయి.చాలా మంది హిందువులు (దళితులు, గిరిజనులతో సహా) చాలా మంది ముస్లిం లను కాపాడడానికి ప్రయత్నించారు,కాపాడారు.చివరికి 20000 మంది హిందువులు,7000 మంది ముస్లిం లు అరెస్టు చేయబడ్డారు.

ఇక్కడ వరకూ చాలా మందికి తెలిసిన విషయాలే.అందులోనూ మీడియా కవరేజీ కూడా గుజరాత్ అల్లర్లు అంటూ ఈ అల్లర్ల గురించి బాగా ప్రచారం చేసాయి.అలాగే ఈ అల్లర్లతో మోడీకి,మోడీ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేశారు.
కానీ అదే సమయంలో గోద్రా రైలు దగ్దం ఘటన తర్వాత జమల్పూర్ లోని ఒక హిందూ ఏరియాలో హిందువుల పైన ముస్లీంలు దాడులు మొదలుపెట్టారు.ఇళ్ళ పైన దాడులు చేసారు, మనుషుల పైన దాడి చేసారు.హిందువులను భయభ్రాంతులకు గురి చేసారు.అయితే పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.కానీ ఈ అల్లర్ల గురించి ఎక్కడా ప్రచారం కాలేదు.తర్వాత నరేంద్ర మోడీ కాలనీని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు.
ఏది ఏమైనప్పటికీ గోద్రా రైలు తగలబెట్టి హిందువులను చంపడంతో మొదలైన ఈ సంఘటనలు చివరికి దేశం లోనే బాధాకరమైన జ్జాపకాలను మిగిల్చి అటు ముస్లింలను,ఇటు హిందువులను ఎంతో మందిని బలి తీసుకున్నాయి.ఇంకెప్పుడూ,ఎక్కడా ఏ వర్గం పైన ఇతర వర్గాల వారు దాడులు చేయకూడదని, దాడులు,ప్రతి దాడులు, ప్రతీకార చర్యలు ఉండకూడదని అందరూ అన్నదమ్ముల లాగా ప్రశాంతంగా బ్రతకాలనీ కోరుకుందాం.ఎందుకంటే ఒకరు దాడి చేస్తే మరొకరు ప్రతి దాడి చేసే అవకాశం ఉండకపోదు.

చివరికి ఈ గొడవల్లో ఉన్న రెండు పెద్ద అపోహలు లేదా ఆధారాలు లేని వాస్తవాలు లేదా కొంత మంది నమ్మకాలు ఏంటంటే
పాకిస్థాన్ లోని ఇంటెలిజెన్స్ ఆదేశాలతో గోద్రా రైలు దగ్దం జరిగింది అనేది ఒకటి అయితే, నరేంద్ర మోడీ ప్రోత్సాహం తోనే గుజరాత్ అల్లర్లు జరిగాయి అనేది రెండోది.ఈ రెండూ కోర్టు లో నిరూపించబడలేదు.కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు నరేంద్ర మోడీ గారిని తమ దేశంలోకి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించాయి.
