LTTE(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ప్రస్థానం. - ధీర సైనికా.... నీకు వందనం....

LTTE(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ప్రస్థానం.

NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.

LTTE(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ప్రస్థానం. 

LTTE గురించి తెలుసుకోవాలంటే అసలు దాని స్థాపనకు కారణమైన శ్రీలంక తమిళుల మరియు సింహళీయుల గొడవలకు కారణం తెలుసుకోవాలి.దాని కోసం అసలు శ్రీలంక తమిళుల చరిత్ర గురించి మనం తెలుసుకుందాం....

శ్రీలంక తమిళుల చరిత్ర       

         శ్రీలంక తమిళులు వీరినే సిలోన్ లేదా ఈలం తమిళులు అని కూడా పిలుస్తారు.వారు శ్రీలంక లోని ఉత్తర ప్రావిన్స్ లో మెజారిటీ గా ఉన్నారు.దాదాపుగా 70% తమిళులు ఈ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు.తూర్పు ప్రావిన్స్ లో కూడా ఎక్కువగానే జీవిస్తున్నారు.అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మైనారిటీ లో ఉన్నారు.వీరిలో ఎక్కువ మంది హిందువులు కాగా కొంత మంది క్రైస్తవ్యం లోకి మారిన వారు కూడా ఉన్నారు.

           పూర్వం నుండి వారి ఉనికి శ్రీలంక లో లేదని కొంత మంది వాదిస్తారు.కానీ ఈ శ్రీలంక తమిళులు శ్రీలంకకు ఉత్తరాన ఉన్న జాఫ్నా రాజ్యం పాలకుల యొక్క  జాఫ్నా రాజ్యం నుంచి వచ్చారునీ,మానవ శాస్త్ర మరియు పురావస్తు ఆధారాల ప్రకారం క్రీ.పూ.2వ శతాబ్దం నుండీ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నారనీ తెలియజేస్తున్నాయి.జాఫ్నా రాజ్యం లో

తమిళ సాహిత్యం శాస్త్రం,మతం మరియు ఇతర అంశాలలో అభివృద్ధి చెందింది.తమిళనాడులో ఇప్పుడు వాడుకలో లేని పదాలు కూడా శ్రీలంక తమిళులలో వాడుకలో ఉన్నాయి.



       కె.ఇంద్రపాల ప్రకారం సాధారణ యుగానికి శతాబ్దాల ముందు మధ్యశిలా యుగంలోనే దక్షిణ భారత దేశం నుండి సాంస్కృతిక వ్యాప్తి,ప్రజల వలసల వల్ల  ప్రాకృతం మరియు తమిళ భాషలు విస్తరించాయి.ఈ సమయంలో శ్రీలంక ద్వీపం లో తమిళ భాషని రాయడానికి తమిళ బ్రాహ్మీ మరియు తమిళ ప్రాకృతి భాషలు ఉపయోగించబడ్డాయి.ప్రోటోహిస్టారిక్ కాలంలో (1000-500 BCE) శ్రీలంక సాంస్కృతికంగా దక్షిణ భారతదేశంతో ఐక్యమైంది మరియు అదే మెగాలిథిక్ ఖననాలు, కుండలు, ఇనుము సాంకేతికత, వ్యవసాయ పద్ధతులు మరియు మెగాలిథిక్ గ్రాఫిటీలను పంచుకుంది.

         ద్వీపం యొక్క పశ్చిమ తీరంలోని పాంపరిప్పు మరియు తూర్పు తీరంలోని కతిరవెల్లిలో మెగాలిథిక్ స్మశాన వాటికల వద్ద బయటపడ్డ ఆధారాలు పాండ్య రాజ్య స్మశాన వాటికలతో సారూప్యత కలిగి ఉన్నాయి.ఇవి క్రీ.పూ.5వ శతాబ్దం నుండి క్రీ.శ.2వ శతాబ్దం మధ్యలో స్థాపించబడ్డాయి.క్రీ.పూ.1300 నాటి ఉత్తర తీరంలోని కందరోడై (కదిరమలై)లో అరికమేడు మాదిరిగానే తవ్వినప్పుడు సిరామిక్ వస్తువులు కనుగొనబడ్డాయి.క్రీ.పూ. 10వ శతాబ్దం నుండి దక్షిణ భారత దేశం మరియు శ్రీలంక లో ఖననం చేసే విధానాలు ఒకే విధంగా ఉన్నట్టు కనుగొన్నారు.శ్రీలంకలో, బ్రాహ్మీయేతర చిహ్నాలను కలిగి ఉన్న నలుపు మరియు ఎరుపు సామాను క్రీ.పూ.10వ శతాబ్దంలో తయారు చేసినట్టు అనురాధపుర నుండి రేడియోమెట్రిక్ ఆధారాలు ఉన్నాయి.

          క్రీ.పూ. 3వ శతాబ్దాలలో దక్షిణ భారతంలో తమిళ బ్రాహ్మీశాసనాలలో కనిపించే కో అటాన్,కో పుటివిరా మారియు కో రా-పుమాన్ వంటి పేర్లతో సరిపోయేలా జాఫ్నా జిల్లాలో అనైకోడ్డైలో తవ్వకాలలో బయటపడ్డ ఇనుప యుగం నాటి అధినేత అస్థిపంజరంతో ఉన్న ముద్ర పైన కో వేటా అనే పేరు చెక్కబడింది.కో ఆంటే తమిళంలో రాజు అని అర్ధం.14వ లేదా 15వ శతాబ్దానికి చెందిన సింహళీయుల నంపోటా ఆధునిక ట్రింకోమలీ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో సహా మొత్తం తమిళ రాజ్యాన్ని దేమల-పట్టాన (తమిళ నగరం) పేరుతో తమిళ ప్రాంతంగా గుర్తించిందని సూచిస్తుంది.

        ఇంకా వీరి చరిత్రకి సంబంధించిన ఎన్నో  సాహిత్య మరియు పురావస్తు ఆధారాల ప్రకారం తమిళులకి ఇక్కడ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నట్టు తెలియజేస్తున్నాయి.



శ్రీలంక తమిళులకు మరియు సింహళీలకు మధ్య విభేదాలు:

          శ్రీలంకలో తమిళులకు మరియు సింహళీలకు మధ్య ఘర్షణలు వలస రాజ్యాల పాలనలో మొదలైంది.బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అనే పద్ధతిని అనుసరించడానికి రెండు జాతుల మధ్య విభేదాలను సృష్టించారు.శ్రీలంక తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా ప్రాంతంలో ఆంగ్ల విధ్యని బోధించడానికి మిషన్ సిలోన్ పేరుతో ఆంగ్ల భాష పాఠశాలలను ‌స్థాపించారు.అయితే ఈ విధ్యతో తమిళులు ఆంగ్ల నైపుణ్యాలను నేర్చుకునేవారు.అలాగే ప్రభుత్వ రంగంలో ఎక్కువ అవకాశాలు పొందేవారు.పైగా సివిల్ సర్వీసెస్ కి ఖచ్చితంగా ఆంగ్ల భాష ఉండాలనే నిబంధన ఉండేది.దీంతో ధనిక తమిళులు ఎక్కువగా ప్రభుత్వ అవకాశాలు పొందేవారు.

         కానీ ఇవన్నీ సింహళీయులలో తమిళుల ఉంచి పైన ఆగ్రహాన్ని పెంచేవి.వారు తమిళులతో ఎందులోనూ పోటీకి రాలేకపోయేవారు.శ్రీలంక దీవిలో మెజార్టీ గా ఉన్న  తమకి ఎటువంటి అవకాశాలు దక్కేవి కాదు.దాంతో వారిని ఈ కారణాలు చాలా అసంతృప్తి కి గురి చేసేవి.సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు సింహళీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ DCRA గూనెతిల్లెకె బ్రిటిష్ వారు తక్కువ సంఖ్యలో ఉన్న తమిళుల పైన ప్రేమని  చూపించేవారనీ, సింహళీల పైన వివక్షని చూపించేవారనీ,దాని వల్ల సింహళీలకు విద్య మరియు ఆర్ధికంగా వెనకబడ్డారని తెలిపారు.పైగా క్రిస్టియానిటి కి పెద్ద పీట వేస్తూ,దేశ ప్రధాన మతమైన బౌద్ధ మతాన్ని అణచివేయాలని చూడడం వారి మనోవేదన తీవ్రతరం చేసింది.

         ఇవన్నీ కాకుండా మత మార్పిడి మిషనరీలు పెరగడం వల్ల తమిళ ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగింది.ఈ మిషనరీ కార్యకలాపాలు ఎదుర్కొనడానికి సొంత పాఠశాలు, దేవాలయాలు నిర్మించుకుని,  సంఘాలుగా ఏర్పడి సాహిత్యాన్ని ప్రచురించేవారు.ఈ ప్రయత్నం వారిని సంఘటితంగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేసింది.19వ శతాబ్దం మధ్య కాలంలో సాంస్కృతికంగా, మతపరమైన మరియు భాషాపరమైన సమాజంగా ఏర్పడడానికి కారణం అయింది.



           శ్రీలంక లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత తమిళులకీ,సింహళీయులకీ మధ్య జాతి ఉద్రిక్తత నెలకొంది.

          1815లో బ్రిటన్ నియంత్రణ లోకి వచ్చిన తర్వాత 1833 లో ముగ్గురు యురోపియన్ లు,ఒక సింహళీయుడు,ఒక బర్గర్ మరియు ఒక తమిళుడితో  గవర్నర్ కి సలహాదారుగా ఒక్కొక్కరితో ఒక్కో శాసన మండలి ఏర్పాటు చేశారు.1931లో డోనమ్ మోర్ కమిషన్ కి సలహా మండలి ప్రవేశపెట్టారు.అప్పటి నుండి శ్రీలంక లోని రెండు మెజార్టీ ప్రజల మధ్యన ప్రాతినిథ్యం, ప్రభుత్వ నిర్మాణం మరియు అధికార భాగస్వామ్యం గురించి వివాదాలు ఏర్పడ్డాయి.దీని ఫలితంగా అంతర్జాతి శత్రుత్వం ఏర్పడ్డాయి మరియు అవి పెరుగుతూ వచ్చాయి.

           తమిళ జాతి వారైన పొన్నంబలం అరుణాచలంగారిని జాతీయ శాసన మండలి లో సింహళీయులతో సహా మొత్తం శ్రీలంక ప్రజలకు ప్రతినిధిగా నియమించినప్పుడు మొదట్లో తమిళులు మరియు సింహళీయుల మధ్యన స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.దాంతో వారి మధ్య ప్రత్యామ్నాయం గా కొలంబో స్థానాన్ని సృష్టించారు.సార్వత్రిక ఎన్నికలు తీసుకొని వచ్చింది.కానీ తమిళులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఎందుకంటే జనాభా పరంగా చూసుకుంటే తమిళులు తక్కువగా ఉండడం వల్ల పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యం ఉండదని గ్రహించి వ్యతిరేకించారు.తమిళ సంఘం నాయకుడు పొన్నంబలం అరుణాచలం సింహళీయులకు 50%-తమిళిలతో సహా మిగిలిన వర్గాలందరికీ 50% ప్రాతినిధ్యం అందించాలని సోల్బరీ కమిషన్ కి ప్రతిపాదించబడింది.కానీ అది తిరస్కరించబడింది.



           స్వాతంత్ర్యం తర్వాత తమిళులు మరియు సింహళీయులను డి.ఎస్.సేనానాయకే తన చాతుర్యంతో సమతుల్యం చేసారు.తర్వాత పొన్నబలం తను స్థాపించిన ఆల్ సిలోన్ తమిళ్ కాంగ్రెస్ పార్టీతో సహా డి.ఎస్.సేనానాయకే యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రభుత్వం లో చేరారు.ఈ ప్రభుత్వం 1948లో సిలోన్ పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు.కానీ దీని వలన ఆంగ్లేయులు పనుల కోసం భారత దేశం నుండి తీసుకెళ్ళిన ప్రజలకు మాత్రం పౌరసత్వం లభించలేదు.

           శ్రీలంక ప్రభుత్వం కేవలం మెజారిటీ సింహళీయులకు మాత్రమే ప్రాతినిధ్యం లభించేది.మైనార్టీ ప్రజలకు ఎటువంటి అవకాశాలు దక్కేవి కావు.ఈ చట్టం వల్ల ఎస్.జె.వి.చెంగల్వ నాయకత్వం లో కొత్తగా ఏర్పడిన ఫెడరల్ పార్టీ మరియు మార్క్సిస్టు గ్రూపులు తమిళ కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా విమర్శించాయి.మరియు చెంగల్వ నాయకం మైనారిటీలను అణగదొక్కుతున్నారంటూ ఆ చట్టం పైన శ్రీలంక సుప్రీం కోర్టు లోనే కాక ఇంగ్లాండ్ ప్రీవీ కౌన్సిల్ లో పెట్టారు.కానీ దాన్ని రద్దు చేయలేకపోయారు.

         తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తమిళ కాంగ్రెస్ కి ఉన్న నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు కైవసం చేసుకుంది.మళ్ళీ 1956లో జరిగిన ఎన్నికలలో తమిళ జిల్లాలలో ఆధిపత్య పార్టీగా అవతరించడమే కాక రెండు దశాబ్దాల పాటు అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది.తమిళ హక్కుల కోసం పోరాడడంలో ఏ మాత్రం వెనకాడకపోవడమే ఇందుకు కారణం.

           1956లో మెజారిటీ సింహళీయుల మద్దతుతో సోలోమనై బండారు నాయకె ప్రభుత్వాన్ని స్థాపించాడు.ఈ కొత్త ప్రభుత్వం కేవలం సింహాళం అనే సింహళాన్ని మాత్రమే శ్రీలంక అధికార భాష గా చేసే చట్టాన్ని చేసారు.దీని ఫలితంగా దాదాపుగా 25 శాతం ఉన్న తమిళులు దీని వలన తమ సంస్కృతికి, భాషకి,మనుగడకి ముప్పు సంభవిస్తుందని భావించారు.దీనికి నిరసనగా ఫెడరల్ పార్టీ శాంతియుతంగా నిరసనలు తెలియజేసారు.కానీ జాతీయ వాదుల పేరుతో వారి పైన దాడులు చేసి వారిని చెల్లాచెదురుగా పారిపోయేలా చేసారు.తర్వాత ఈ గొడవలు జాతుల మధ్య గొడవగా మారింది.దేశంలో తూర్పున గలై ఓయా ప్రాంతంలో జరిగిన అల్లర్లలో దాదాపుగా 150 మంది తమిళులు మరణించారు.చివరికి బండారు నాయకే ఆందోళనకారులతో మరియు ఫెడరల్ పార్టీ తో చర్చలు జరిపి చెల్వనాయకం ఒప్పందానికి అంగీకరించారు.దీని ప్రకారం తమిళ మెజారిటీ ప్రాంతాలైన ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో  తమిళ భాషని అధికార భాష గా గుర్తించారు.కానీ దీనికి వ్యతిరేకంగా యునైటెడ్ నేషనల్ పార్టీ,జె.ఆర్.జయవర్ధనే నేతృత్వంలో మార్చ ఆన్ క్యాండీ నిర్వహించారు.పైగా దీనికి వ్యతిరేకంగా బౌద్ధ సన్యాసుల నుండి కూడా తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆ చట్టాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.



              సింహళం మాత్రమే అధికార భాష చట్టంతో వాహనాల పైన నెంబర్ ప్లేట్ ల పైన సింహళ భాషలో శ్రీ అనే అక్షరాన్ని ప్రచురించేలా చేసింది.అయితే ఈ శ్రీ అనే అక్షరానికి వ్యతిరేకంగా ఫెడరల్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.శ్రీ అక్షరాల పైన నల్ల తారు పూయడం ప్రారంభించారు.దీని వలన శ్రీ అనుకూల ప్రచారం చేసే సింహళ ముఠాల ద్వారా తమిళ కార్యాలయాలు,దుకాణాలు,ఇళ్ళు, దక్షిణ ప్రాంత ప్రజలపై ప్రతీకార చర్యలకు దారి తీసింది. కొండ ప్రాంతాల్లో తమిళ భారతీయ యువకులు కూడా శ్రీ వ్యతిరేక ప్రచారం జోరుగా చేసారు.వారు ఒక బస్సు పైన రాళ్ళు రువ్వారు.బస్సు డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్ళాడు.కానీ ఆందోళనకారులు బస్సును వెంబడించి, పోలీస్ స్టేషన్ పైన కూడా దాడికి దిగారు.దాంతో పోలీసులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో ఇద్దరు తమిళులు మరణించారు.కోపానికి లోనైన ఆందోళనకారులు సింహళీయుల ఆస్తుల పైన దాడులు చేస్తూ నాశనం చేయడం ప్రారంభించారు.దీని వల్ల సింహళీయులు కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించారు.ఏప్రిల్ 3న కుహవట్టేలో శ్రీ అనుకూల ప్రచారం ప్రారంభించారు.కానీ అదే రోజున ఇద్దరు సింహళీయులను తమిళ వ్యాపారస్తులు కత్తితో పొడిచి చంపారు.ఫలితంగా తమిళ దుకాణాలు తగలబడిపోయాయి.మరుసటి రోజు హటన్ ప్రాంతంలో ఒక సింహళం వ్యక్తిని తమిళ గుంపు రాళ్ళతో కొట్టి చంపారు.బండారు నాయకే సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ నాయకుడు సవుమియామూర్తి తొండమాన్ ను అల్లర్లను శాంతింపజేయాల్సిందిగా అభ్యర్ధించారు.తొండమాన్ ఆయా ప్రాంతాలకు వెళ్లి విజయవంతంగా ఆపగలిగారు.

            అదే సమయంలో లాండ్ డెవలప్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన 300 మంది సింహళీయులు ఆయుధాలు పట్టుకుని ట్రక్కులలో తమిళ గ్రామమైన చెడ్డీకులం కు బయలుదేరారు.వారు అక్కడికి చేరక ముందే నలుగురు సాయుధ తమిళ బృందం ముఠా పైన కాల్పులు జరపడంతో ముఠా అక్కడ నుండి పారిపోయారు.

           అదే సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ ట్రింకోమలీలో తన స్థావరాన్ని నిలిపివేయడంతో 400 మంది తమిళ కార్మికులు ఏ ఆధారం లేని వారయ్యారు.వీరికి పులోనరువా జిల్లాలో పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అక్కడ సింహళీయులకు ఆగ్రహం కలిగి సింహళ కార్మిక ముఠాలను ఏర్పరచుకుని తమిళుల పైన దాడులు చేస్తామంటూ బెదిరించారు.

             ఏప్రిల్ 14న ట్రింకోమలిలో జాతి గొడవల్లో ఒక తమిళుడు సింహాళుడిని హత్య చేసాడు.దీని వలన ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ అవి పెద్దవి కాలేదు.కాకపోతే బౌద్ధులు మాత్రం సింహళీయుల వద్ద తమిళులు ఉండకూడదని పట్టుబట్టారు.

          ఏప్రిల్ 24న వెలిమడలో జాతీయవాది కె.ఎం.పి.రాజారత్నే ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో తమిళ వ్యాపార సంస్థలపై అనేక దాడులు జరిగాయి.అంతేకాకుండా సింహళీయేతర బౌద్ధులు ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలకు తరలివెళ్ళకపోతే వారి పైన దాడులు చేస్తామని కరపత్రాలను ప్రభుత్వ ప్రతినిధులకు,ప్రజా ప్రతినిధులకు అందిస్తూ తమ జాత్యహంకారాన్ని ప్రకటించుకున్నారు.

            మే 15న ఒక తమిళ వ్యక్తి ఇంటి పైన బాంబు విసిరిన తర్వాత,ఒక సింహళీయుడి హత్య మరియు మరొక సింహళీయుడి కత్తి పోట్లతో తీవ్ర గాయాలపాలవడం జరిగింది.మరణించిన వ్యక్తి శరీరాన్ని అతని స్వస్థలం మాతర కు పంపించారు.అక్కడ కూడా ఉద్రిక్తితలు చెలరేగాయి.



         వవునియాలో ఫెడరల్ పార్టీ సమావేశం జరగాల్సి ఉంది.అయితే దానికి రైలు మార్గం లో వచ్చేవారిని ఆపాలనీ,ఇబ్బందులు పాలు చేయాలనీ కరడుగట్టిన సింహళీయవాదులు ఆలోచించారు.మే 22న పోలిన్నరువా స్టేషన్ పైన మొదటి దాడి జరిగింది.ఆ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు ముందుగానే దిగిపోయారు.కానీ ఆందోళనకారులకు ఒక వ్యక్తి దొరికాడు.అతను తాను తమిళుడిని కాదనీ ఎంతగా చెప్పినప్పటికీ అతనిని చితకబాదారు.

    మే 23న తమిళులు ఎక్కువగా ఉండే బట్టివలోకాలో రాత్రి సమయంలో ఒక మెయిల్ పట్టాలు తప్పింది.అందులో ఎక్కువ ప్రయాణీకులు సింహళీయులు.వారే దాడికి గురయ్యారు.పోలీస్ సార్జెంట్ అప్పుహమీ,విక్టర్ ఫెర్నాండో, కానిస్టేబుల్ పరరాజసింహ అనే ముగ్గురు వ్యక్తులు మరణించారు.అక్కడ ఏ జాతి వారు దాడులు చేశారు అనేది పూర్తిగా తెలియనప్పటికీ తమిళుల ప్రాంతం కనుక పోలిన్నరువా ప్రాంతంలో జరిగిన దాడికి ప్రతీకార దాడి అయి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం.

           మే 24న పోలొన్నరవా లో తమిళుల పైన తీవ్రమైన దాడులు జరిగాయి.బహిరంగంగా తమిళులు హత్య కాబడ్డారు.ఈ గొడవల్లో గుర్తు తెలియని వ్యక్తులు కూడా మరణించారు.సింహళ సైన్యం వివిధ రాష్ట్ర శాఖల నుండి వచ్చిన కార్మికులతో కూడిన సైన్యం విధ్వంసాన్ని సృష్టించి రేప్ చేయడం, దోచుకోవడం, తమిళుల పైన తీవ్రమైన దాడులు చేయడం లాంటివి చేశారు. కొంత మంది సింహళీయులు తమిళులను దాచడానికి ప్రయత్నించారు.అలా దాస్తున్నారని అనుకలిగిన వారిని కూడా ఆందోళనకారులు విడిచిపెట్టలేదు.అదనపు బలగాల కోసం అభ్యర్ధించినప్పటికీ పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు.పోలీసులు కాల్పులు జరపరన్న నమ్మకంతో అల్లరి మూకలు మరింత రెచ్చిపోయారు.మరొకసారి పోలోన్నరువా స్టేషన్ పైన దాడి జరిగింది.ఈసారి స్టేషన్ మొత్తం ధ్వంసం కాబడింది.

         ఎరావూరులో ఆరోజు సాయంత్రానికి తమిళుల హింస బాగా పెరిగిపోయింది.నువారా ఎలియా మాజీ మేయర్ డి.యె.రత్న ఆ రాత్రి తన కల్కుడాలోని తన ఎస్టేట్ కి వెళ్తుండగా కాల్చి చంపబడ్డారు.అయితే ఇది కేవలం వ్యక్తిగత హత్య అని తమిళ రాజకీయ నాయకులు వాదించారు.

         మే 25న ఎరావూరులో ఒక సింహళీయ పోలీస్, ముగ్గురు సింహళీయులు తమిళుల దాడిలో మరణించారు.

        పోలన్నరువా పొలాల్లోని తమిళ కూలీలపై సింహళీయ ముఠాలు రాత్రి పూట దాడి చేసాయి.వారిని చూసిన తమిళులు చెరుకు తోటల్లో దాక్కున్నారు.అయితే అది గమనించి చెరుకు తోటలకు నిప్పంటించి వారిని బయటకొచ్చేలా చేసి దొరికిన వారిని దొరికినట్లు పిల్లలు, స్త్రీలు, పురుషులు అని పట్టించుకోకుండాఇంట్లో తయారు చేసిన కత్తులు,గడ్డికోసే కత్తులు మరియు కట్టర్లతో నరికేసారు.పారిపోయిన వారిని కూడా తీవ్రంగా గాయపర్చారు.హింగురక్ గోడలో ఎనిమిది నెలల గర్భవతి పొట్టని చీల్చి చంపారు.భయంతో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఆరాత్రి 70 మంది మరణించి ఉంటారని ఒక అంచనా,ఇది నిజం కాదని మరొక వాదన కూడా ఉన్నాయి.

           మే 26న పోలన్నురువాలోని తమిళ శరణార్ధులను పోలీస్ స్టేషన్ లో ఉంచి, పోలీసులు కాపలాగా ఉన్నారు.స్టేషన్ లో సమావేశమైన సింహళీయులు రాత్రి పూట దాడి గురించి చర్చించుకుంటున్నారు.పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్న పోలీసులు కేవలం కొద్ది మంది మాత్రమే.కానీ మధ్యాహ్నం 2 గంటలకు 25 మంది సైనిక బృందం పోలీసులకు తోడయ్యారు.అది గమనించిన సింహళీ గుంపు మరింత మంది వచ్చేలోగా దాడి చేయాలనుకున్నారు.మధ్యాహ్నం 3.20 ప్రాంతంలో వారు పోలీస్ స్టేషన్ వైపు వచ్చారు.సైన్యం వారిని హెచ్చరించడానికి కాల్పులు జరిపారు.కానీ అది కేవలం భయపెట్టడానికి మాత్రమే అని భావించిన ఆందోళనకారులు ముందుకు కదిలారు.పొలన్నరువా జిల్లా ప్రభుత్వ అధికారి కాల్పుల ఉత్తర్వు పైన సంతకం చేయడంతో 3000 మంది సింహళీ గుంపు పైన కాల్పులు జరిపారు.అందులో ముగ్గురు చనిపోగా మిగిలిన వారు చెల్లా చెదురైపోయారు.

      కురునేగల, దంబుల్లా, గలేవెల, పాణదుర వంటి ప్రాంతాల్లో కూడా తమిళులపై హింస జరిగింది. ఆ ఉదయం 10 గంటలకు, పోలీసు సార్జెంట్ అప్పుహామి మరియు D. A. సెనెవిరత్నే మరణ వార్త వ్యాప్తి చెందడంతో, కొలంబో మరియు దాని శివార్లలోని అనేక ప్రాంతాల్లో సింహళ ముఠాలు తమిళుల పైన దాడులు ప్రారంభించాయి,దుకాణాలను తగలబెట్టి దోచుకున్నారు.దోపిడీలు,దహనాల వరకే అప్పటి దాడులు పరిమితమయ్యాయి.

           ఆ సాయంత్రం, ప్రధాని బండారునాయకే దేశానికి శాంతి కోసం పిలుపునిచ్చాడు. ఏది ఏమైనప్పటికీ, బట్టికలోవా జిల్లాలో జరిగిన హత్యలను, ప్రత్యేకించి D. A. సెనెవిరత్నే హత్యను మతపరమైన హింసకు కారణంగా పేర్కొనడం ద్వారా తమిళుల పైన అల్లర్లను ప్రారంభించారని అతను సూచించాడు.

             బండారు నాయకె పిలుపు తమిళ వ్యతిరేక అల్లర్లను మరింత తీవ్రతరం చేసాయి.అప్పటి వరకు దాడులు,దహనాలకు పరిమితమైన అల్లర్లు ఇప్పుడు హత్యలు,మానభంగాలతో చెలరేగిపోతున్నాయి.తూర్పు ప్రావిన్స్ లోని తమిళ అల్లరి మూకల చేత సముద్రంలోకి తరిమివేయబడ్డ సింహళ జాలర్లు తిరిగి రావడంతో కొలంబో నుండి మాతర వరకు తీరం వెంబడి తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి.

           బట్టికలోవా లో తమిళులు ఒక మహిళా టీచర్ ని రొమ్ములు కోసి హత్య చేసారనే పుకారు వ్యాపించింది.ఈ పుకారుతో రెచ్చిపోయిన సింహళ అల్లరి మూకలు ఒక హిందూ ఆలయాన్ని థగలబెట్టడానికి ప్రయత్నించారు.కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుని దాని లోపలి పూజారిని బయటకి లాగి సజీవంగా తగలబెట్టారు.కానీ ఆ తర్వాత టీచర్ పైన జరిగిన దాడి కేవలం కల్పితమని తేలింది.సింహళీయుల ముఠాలు తమిళుల కౌసం కొలంబో అంతా వెదుకుదున్నాయి.వారిని గుర్తించడం ఎలాగంటే వారు ధరించే ప్యాంటు మరియు పైన చొక్కాలు.చెవులు కుట్టించబడి ఉండడం.అలాగే సింహళ వార్తా పత్రికలు చదవలేకపోవడం.వీరంతా ఘోరంగా గాయపడ్డారు లేదా హత్యకు గురయ్యారు.వీరిలో ఆంగ్లం చదువుకున్న సింహళీయులు కూడా బలైపోయారు.

         ఈ ముఠాలు ఒక పన్నాగాన్ని రచించాయి.శ్రీలంక పోలీసులు లా వచ్చి మీ భద్రత కోసం పోలీస్ స్టేషన్ లకు పారిపోమ్మని చెప్పేవారు.వారు వెళ్ళిపోయాక ఖాళీ ఇళ్ళను దోచుకుని తగలబెట్టేవారు.అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దాడులు, దహనాలు తీవ్రంగా దేశమంతా పెరిగిపోయాయి.పోలీసులు చివరికి అల్లర్లను అణచివేయడానికి ప్రయత్నించారు కానీ మొదటి నుండి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి.కొంత మంది సింహళీయులు తమ పొరుగు తమిళులను దాచిపెట్టి కాపాడుకోడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

            పదవీయ నుండి భూ అభివృద్ధి మరియు నీటి పారుదల శాఖకి సంబంధించిన 300 మంది సింహళీయులు తుపాకీలు,చేతి బాంబులు మరియు కత్తులతో ముఠాలుగా ఏర్పడి ట్రక్కులలో అనురాధాపురానికి వెళ్ళాలనుకుని సైన్యాన్ని తప్పించుకొని వెళ్ళడానికి రహదారి ని వదిలి వేరే మార్గాలలో వెళ్ళారు.దారిలో కనిపించిన తమిళుల పైన దాడి చేశారు.కెబిటిగొల్లేవకు దక్షిణాన అల్లరిమూకలను సైన్యం మరియు పోలీసులు అడ్డుకున్నారు.11 మంది అల్లరి మూకలను చంపి,343 మందిని అరెస్టు చేశారు.కొంత మంది ఖైదీలు తమని ఆపకపోయి ఉంటే దక్షిణంగా మాతలే మరియు క్యాండీ కి వెళ్ళి ఉండేవారమని ఒప్పుకున్నారు.



        మే 23 మరియు 24 తేదీలలో జరిగిన పోలొన్నరువా సంఘటనల తర్వాత ఎరావురులోని తమిళ అల్లర్లు ఏకాంత సింహళీయ గృహాల పైన,జనాల పైన,వ్యాపారాల పైన దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.ఎరావూరులో రెండు వర్గాల మత్స్యకారులు కొట్టుకున్నారు.తమిళ ముఠాలు రోడ్లను బ్లాక్ చేసి సింహళీయులుగా అనుమానించిన వాహనదారుల పైన దాడులు చేశారు.ఒక సింహళీయ జంటను తగలబెట్టి దోచుకున్నారు.

             పాణుదుర పూజారి మరియు తమిళ ఫిస్కల్ క్లర్క్ ల హత్య వార్తలు తెలిసిన వెంటనే హింస తీవ్రతరమైంది.బట్టవలోక జిల్లా అంతటా సింహళీయులను తమిళ అల్లరి మూకలు నిర్దాక్షిణ్యంగా చంపారు.వళైచ్చెనైలో, తమిళ గుంపుల నుండి పారిపోయిన సింహళీయులకు ముస్లింలు ఆశ్రయం కల్పించారు.బట్టవలోక లో మొత్తం 56 దహన,11 హత్యల కేసులు నమోదయ్యాయి.చాలా మంది సింహళీయులు దక్షిణ తీరం వెంబడి సముద్రం ద్వారా మరియు నేల పై నుండి పారిపోయారు.కొంత మంది మాత్రం దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు.వారు అడవి మృగాల వల్ల మరియు ఆకలితో మరణించారు.వారి ఇళ్ళు దోచుకోబడ్డాయి.

          మే 28న పాణుదుర పూజారి హత్య వార్త వచ్చినప్పుడు జాఫ్నా కూడా హింసాత్మకంగా మారిపోయింది.మరణాలు జరిగినట్లు రికార్డులు లేకపోయినప్పటికీ సింహళీ వ్యాపారులను తరిమేసి సరుకులను దోచుకున్నారనీ, తగులబెట్టారనీ నివేదించారు.కొన్ని సార్లు ముఠాల ప్రవర్తన కొలంబో లోని నాయకులకు సంబంధాలున్నట్లు అనుమానించేలా చేసాయి.తర్వాత పునర్నిర్మించిన బౌద్ధ నాగ విహారే ఆలయం పై దాడి చేసి, బౌద్ధ సన్యాసిని హతమార్చడానికి ప్రయత్నం చేశారు.కానీ పోలీసులు అడ్డుకున్నారు.రెండు రోజుల తర్వాత కైట్స్ నుండి ఒక ముఠా నైనాతీవు వద్ద ఉన్న నాగ దీప విహారె ఆలయంలోకి ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు.

       చివరికి ఈ ఘర్షణల ఫలితంగా ఫెడరల్ పార్టీ మరియు జాతీయ విముక్తి పెరమున రెండూ నిషేధించబడ్డాయి.దేశంలోని చాలా మంది సీనియర్ తమిళ నాయకులను అరెస్టు చేశారు.రెండు రోజుల్లో సైన్యం కొలంబో లో ఇంకా దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులను పునరుద్ధరించారు.దాదాపుగా 12,000 మంది తమిళ శరణార్థులు కొలంబో సమీపంలోని శరణార్థ శిబిరాలకు పారిపోయారు.జూన్ చివరికి జాఫ్నాలో పెద్ద ఎత్తున పునరావాసం కల్పించేందుకు ఆరు యురోపియన్ నౌకలను రహస్యంగా నియమించింది.సైన్యం దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించుకుంది.కానీ జాఫ్నాలో మాత్రం 25 సంవత్సరాలు కొనసాగింది.

       1958 సెప్టెంబర్ 3న బండారు నాయకే-చెల్వనాయకం తమిళ భాష చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.దీని ద్వారా తమిళ భాషని బోధనా మాధ్యమంగా,పబ్లిక్ సర్వీస్ లలో ప్రవేశానికి, రాష్ర్ట కరెస్పాండెన్స్ మరియు పరిపాలనా ప్రయోజనాల కోసం పరీక్షలలో మాధ్యమంగా ఉపయోగించడం జరుగుతుంది.

           మొత్తానికి 1958 అల్లర్లు మొదటి పూర్తి స్థాయి జాతి ఆందోళనలుగా మిగిలాయి.మరియు ఒకరి పైన మరొకరు నమ్మకాన్ని కోల్పోయేలా చేసాయి.ఈ తప్పుకి రెండు జాతులూ ఎదుటి వారిని నిందించుకున్నారు.తమిళ మెజారిటీ ప్రాంతాల నుండి సింహళీయులు,సింహళీయుల మెజారిటీ ప్రాంతాల నుండి తమిళులు తరిమివేయబడ్డారు.

          వేలుపిళ్లై ప్రభాకరన్ తన రాజకీయ ఆలోచనలు చిన్నప్పటి 1958 నాటి సంఘటనల నుండే రూపుదిద్దుకున్నాయని తెలియజేసారు.




"నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు 1958 జాతి అల్లర్ల యొక్క దిగ్భ్రాంతికరమైన సంఘటనలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి.సింహళ జాత్యహంకారులచే మన ప్రజలను నిర్దాక్షిణ్యంగా మరియు క్రూరంగా ఎలా చంపబడ్డారనే భయంకరమైన సంఘటనల గురించి నేను విన్నాను. ఒకసారి నేను ఒక వితంతువు తల్లిని కలిశాను, నా కుటుంబానికి చెందిన స్నేహితురాలు, ఈ జాతి సమూలంగా నాశనం చేసే దాడులు యొక్క తన వ్యక్తిగత అనుభవాన్ని నాకు తెలియజేసింది. అల్లర్ల సమయంలో, కొలంబోలోని ఆమె ఇంటిపై సింహళ గుంపు దాడి చేసింది. అల్లరి మూకలు ఇంటికి నిప్పంటించి భర్తను హత్య చేశారు. ఆమె, ఆమె పిల్లలు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆమె శరీరంపై ఉన్న మచ్చలు చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మరిగే తారులో చిన్నపిల్లలను సజీవంగా ఎలా కాల్చేశారో కూడా నేను కథలు విన్నాను. ఇలాంటి క్రూరత్వ కథలు విన్నప్పుడు, నా ప్రజల పట్ల నాకు లోతైన సానుభూతి మరియు ప్రేమ కలిగింది. ఈ జాత్యహంకార వ్యవస్థ నుండి నా ప్రజలను విముక్తి చేయాలనే గొప్ప అభిరుచి నన్ను ముంచెత్తింది. నిరాయుధ, అమాయక ప్రజలపై సాయుధ శక్తిని ఉపయోగించుకునే వ్యవస్థను ఎదుర్కోవడానికి సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని నేను గట్టిగా భావించాను." అని తన మనసులోని సంఘర్షణను బయటపెట్టారు.

అలాగే తమిళ పూజారిని చంపడం గురించి తమిళుల అభిప్రాయాలు



"మాది దైవభీతితో కూడిన సమాజం మరియు ప్రజలు మతపరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విస్తృత భావన ఏమిటంటే: అతనిలాంటి పూజారిని సజీవ దహనం చేసినప్పుడు, తిరిగి కొట్టే సామర్థ్యం మాకు ఎందుకు లేదు. అది ప్రజలను లోతుగా ఆలోచించేలా చేసింది. ”

LTTE స్థాపనకి దారి తీసిన సంఘటనలు మరియు ఎదుగుదల:

 1971లో విశ్వవిద్యాలయాలలో తమిళ విద్యార్థుల సంఖ్య తగ్గించాలని,సింహళం రాజ భాష గా చేసారు.తమిళానికి మాత్రం ప్రతి జిల్లాకు కొంత కోటాను కేటాయించారు.సత్యశీలన్ అనే విద్యార్థి తమిళ్ మనవర్ పెరవై అనే పేరుతో తమిళ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేశారు.

            1972లో ప్రభాకరన్,చెట్టి తన బాల సింగం,జాఫ్నాలో తమిల్ న్యూ టైగర్స్ స్థాపించారు.కానీ నాయకుడు తనబాలసింగాన్ని హత్య చేసారు.అతని మరణం తర్వాత ప్రభాకరన్ బాధ్యతలు స్వీకరించారు.

             నడరాజాతంగతురై మరియు సెల్వరాజాయోగచంద్రన్(డి.గెరే కుట్టి మణి) కలిసి  తమిళ దేశ స్థాపన కోసం ప్రచారం కోసం తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ (టి.ఇ.ఎల్.ఒ) స్థాపించారు.పొన్నుతురై శివకుమారన్ తో కలిసి చాలా దాడులు చేసారు.

             1974లో తమిళ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటే ఎటువంటి హెచ్చరికలు లేకుండా సింహళీ పోలీసులు దాడి చేశారు. పోలీసు వల్ల 11 మంది తమిళులు మృతి చెందారు.

శివకుమార్,ప్రభాకరన్ కలిసి దురైయప్ప పైన హత్యాయత్నం చేసారు.కానీ ఆయన తఫ

ప్పించుకోవడంతో పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో శివకుమారన్ ఆత్మహత్య చేసుకున్నారు.కానీ ప్రభాకరన్ తప్పించుకున్నారు.

               ఆ తర్వాత 1975 జులై 27న దురైయప్పను  ప్రభాకరన్ హత్య చేసారు.

               1976 మే 5  ఉమా మహేశ్వర్ నాయకుడిగా,ప్రభాకరన్ కమాండర్ గా తమిళ రాజ్య స్థాపనే లక్ష్యంగా ఎల్.టి.టి.ఈ. స్థాపించడం జరిగింది.తీవ్రవాద నిపుణుడు రోహన్ గుణరత్న ద్వారా TNT(తమిళ్ న్యూ టైగర్స్)/LTTE లను శతృ దుర్భేద్యంగా,ఏ మాత్రం కరుణ లేకుండా అభివృద్ధి చేయాలనుకున్నారు.మొదట్లో పోలీసులు మరియు  రాజకీయ నాయకుల పైన కొన్ని దాడులు మాత్రమే చేసారు.క్రమంగా ఆ దాడులను పెంచుకుంటూ చాలా ప్రాంతాల పైన ఆధిపత్యం సాధించారు, వీరి తమిళ దేశ స్థాపన అనే లక్ష్యం వల్ల తమిళ ప్రజల్లో కూడా వీరిపై బాగా నమ్మకం పెరిగింది.

             తమిళ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు అప్పా పిళ్ళై అమృత లింగం రహస్యంగా ఎల్.టి.టి.ఈ.కి  మద్దతు ఇచ్చేవారు, రాజకీయంగా ఉపయోగపడుతుందనీ, తమిళ ప్రజలను అదుపు చేయవచ్చనీ,పైగా తమిళులకు ప్రభుత్వం తరపు నుంచి మంచి చేయోచ్చనే ఆలోచనతో ఆయన ఈ మద్దతునిచ్చేవారు.ఎల్.టి.టి.ఈ. మొదటి మహిళా సభ్యురాలిగా ఊర్మిళ కందియా చేరారు.

             అమృత లింగం ప్రభాకరన్ కు  ఎన్.ఎస్.కృష్ణన్ ని పరిచయం చేసాడు, తర్వాత ఎన్.ఎస్.కృష్ణన్ ప్రభాకరన్ కు ఆంటోన్ బాల సింహానికి పరిచయం చేసాడు.1979లో ఎల్.టి.టి.ఈ. ప్రధాన సంధానకర్త, రాజకీయ వ్యూహకర్తగా ఆంటోన్ బాల సింహం అయ్యాడు.

              ఎలై.టి.టి.ఈ. నాయకుడు ఉమామహేశ్వరరావు ఊర్మిళ కందియా తో ప్రేమ వ్యవహారం నడిపాడు,అది తమ సిద్ధాంతాలకు వ్యతిరేకమని అతన్ని ప్రభాకరన్  బహిష్కరించాడు.




              తర్వాత ప్రభాకరన్ ఉమా మహేశ్వరన్ 1980లో పీపిల్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం(plote)ని స్థాపించాడు.

              1980లో జూనియస్ రిచర్డ్ జయవర్ధనే ప్రభుత్వం Tulf  అభ్యర్ధన మేరకు జిల్లా అభివృద్ధి మండలి ద్వారా అధికార పంపిణీకి అంగీకరించారు.అంటే వారి ప్రదేశాల్లో వారి నాయకులకు అధికారం లభించేలాగా ఈ ఒప్పందం ఉంటుంది.కానీ ltte మరికొన్ని తిరుగుబాటు గ్రూపులు ప్రత్యేక దేశం కావాలని కోరారు.Tulf మరియు ఇతర తమిళ రాజకీయ పార్టీల పైన ప్రజల్లో నమ్మకం పోయి తిరుగుబాటు సంస్థల్నే ఎక్కువ నమ్మారు.

            1983 స్థానిక ప్రభుత్వ ఎన్నికలను బహిష్కరించమని ltte ప్రజలను ఆదేశించింది.ఆ ప్రభావం తో ఆ సంవత్సరం 10% ఓటింగ్ కూడా రాలేదు.1983 తిరునల్వేలిలో ఆత్మాహుతి దాడి చేశారు,ఈ దాడిలో 13 మంది శ్రీలంక సైనికుల మరణించారు.ఈ దాడితో శ్రీలంక సింహళీయులు బ్లాక్ జులై గా పేర్కని తమిళుల పైన దాడి చేసారు,ఈ దాడిలో దాదాపు 3000 మంది తమిళులు మరణించారు.దాంతో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది తమిళులు తిరుగుబాటు గ్రూపులలో చేరారు.



            1984లో తమిళనాడు లోని సిరుమలై కాంప్ లో చాలా మంది తిరుగుబాటు దారీ నాయకులు భారత సంస్థ అయిన RAW ద్వారా శిక్షణ పొందారు.32 శిబిరాలలో 495 మంది తిరుగుబాటు దారులకు శిక్షణ ఇచ్చారు.92 మంది మహిళలు కూడా శిక్షణ పొందారు.1983 నుండి మే 1987 వరకు రా వారికి ఆయుధాలను, ధనాన్ని సరఫరా చేసింది.

             నిజానికి శ్రీలంక లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమిళ దేశ స్థాపన, తమిళుల కోసం పోరాడడానికి కేవలం ఎల్.టి.టి.ఈ. మాత్రమే కాదు.మరిన్ని తిరుగుబాటు సంస్థలు ఉండేవి. 1984లో ltte అధికారికంగా ఈలం నేషనల్  లిబరేషన్ ఫ్రంట్(e.n.l.f.),తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ (t.e.l.o.),ఈలం రివల్యూషనరీ ఆరైగనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ (e.r.o.s.),పీపిల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య ఉమ్మడి ఫ్రంట్ లో చేరింది.

          మొదట్లో ప్రేమ వ్యవహారాలు నిషేధించి ఎల్.టి.టి.ఈ. 1984లో ప్రభాకరన్ వివాహం తర్వాత ఆ నిబంధన మార్చారు. telo భారత్ తమకు మేలు చేసిందని నమ్మి భారతదేశానికి మద్దతుగా ఉంటే,ltte భారతదేశం తన స్వార్థం కోసం పని చేస్తుంది అని వాదించారు.ఎల్.టి.టి.ఈ. 1986 లో  ఈ.ఎన్.ఎల్.ఎఫ్. నుండి విడిపోయింది.వెంటనే TELO  తో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.TELO నాయకులతో సహా 400 మందిని L.T.T.E. హత్య చేసారు.


            LTTE ఆ తర్వాత EPRLF శిక్షణ శిబిరాల పైన దాడి చేసి జాఫ్నా నుండి పారిపోయారు. TELO,EPRLF లాంటి ప్రధాన తిరుగుబాటు దారీ గ్రూపులను అంతం చేసిన తర్వాత దాదాపు 20 సంస్థలు LTTE లో విలీనం చేసారు.తమిళులకు ప్రత్యేక దేశాన్ని స్థాపించడమే మా లక్ష్యం అని ప్రమాణం చేయడంతో తమిళ ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడింది.

          1987లో బ్లాక్ టైగర్స్ అనే ఆత్మాహుతి సంస్థను ఏర్పాటు చేశారు.ఈ సంస్థ ద్వారా  సైనిక శిబీరాల పై మొదటి దాడి చేశారు.



           1987 జులై లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తమిళుల పైన దాడిని ప్రారంభించింది.

ఇండో-శ్రీలంక ఒప్పందం పై రెండు దేశాలు సంతకం చేశారు.ఈలం పీపుల్స్ రివెల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ ప్రాంతీయ మండలిని నియంత్రిస్తుంది.ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరుతో శాంతి పరిరక్షక దళాన్ని శ్రీలంకకు పంపి నిరాయుధీకరణను అమలు చేయించడానికి ప్రయత్నం చేసింది మరియు ప్రాంతీయ మండలి పైన నిఘా ఉంచింది.

             ఇండో-లంక ఒప్పందానికి EPRLF,TELO,EROS మరియు PLOTE వంటి సమూహాలు కూడా అంగీకరించారు.కానీ LTTE దానిని వ్యతిరేకించారు.ఎందుకంటే eprlf నాయకుడు వరద రాజ పెరుమాళ్ళుని విలీనమైన ఈశాన్య ప్రావిన్స్ కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు.కానీ LTTE ఆయన్ని కాదని ముగ్గురు ప్రత్యామ్నాయ అభ్యర్థులను పేర్కొన్నారు, కానీ భారత్ దాన్ని వ్యతిరేకించారు.‌దాంతో LTTE తమ ఆయుధాలను IPKF కు అప్పగించేందుకు అంగీకరించలేదు.మూడు నెలలు ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

             LTTE అక్టోబర్ 1987న IPKF పైన యుద్ధం ప్రకటించింది.అక్టోబర్ 8న భారత రేషన్ ట్రక్కు పై మొదటి దాడి చేశారు.ఐదుగురు పారా కమాండోలను మెడకు ఉరి వేసి చంపారు.జాఫ్నాలో ఆపరేషన్ పవన్ పేరుతో LTTE ని నిరాయుధులను చేయడమే కాకుండా దాడులు ప్రారంభించారు.ఈ దాడులు తమిళులకు పెద్దగా నచ్చలేదు.ప్రేమదాస ప్రభుత్వానికి మద్దతునివ్వడం,తభ దేశ విషయాల్లో భారతీయ జోక్యం చేసుకోవడం సింహళీయులకు కూడా నచ్చలేదు.

              1988 ఎన్నికల ప్రచారంలో రణసింగ్ ప్రేమదాస తాను అధ్యక్షుడు గా ఎన్నికైన వెంటనే IPKF ని ఉపసంహరిస్తానని మాట ఇచ్చాడు.ఎన్నికైన తర్వాత 1989 ఏప్రిల్ లో LTTE తో చర్చలు ప్రారంభించారు.IPKF మరియు తమిళ్ నేషనల్ ఆర్మీ తో పోరాడేందుకు LTTE కి ఆయుధాలు మరియు సామగ్రిని సరఫరా చేయమని శ్రీలంక సైన్యానికి చెప్పారు.IPKF దాదాపుగా తన లక్ష మంది సభ్యులతో 1990 లో  ప్రేమదాస అభ్యర్ధన మేరకు శ్రీలంక ను విడిచి పెట్టింది.

              ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో తమిళులకు అధికారం ఇచ్చేలా శాంతి చర్చలు జరిగాయి.1989 నుండి 1990 వరకూ కాల్పుల విరమణ జరిగింది.కానీ మధ్యలో LTTE తూర్పు ప్రావిన్స్ లో 600 పోలీసులను ఊచకోత కోసారు.1990 దశకం మొత్తం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.



             1991లో LTTE తమ ఆత్మాహుతి సభ్యురాలితో రాజీవ్ గాంధీ ని భారత మాజీ ప్రధాని మరియు 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణ సింఘే ప్రేమదాసను హత్యలు చేయించారు.1994లో శ్రీలంక అధ్యక్షురాలిగా చంద్రికా కుమార తుంగ ఎన్నికైన తర్వాత LTTEతో చర్చలు చేసిన తర్వాత కొంత కాలం దాడులు ఆగాయి.



            ఒకప్పటి ఎల్.టి.టి.ఈ. నాయకుడు మహత్తయ్య దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొని 1994లో ఎల్.టి.టి.ఈ. చేత చంపబడ్డాడు.ప్రభాకరన్ ను ఎల్.టీ.టీ.ఈ.నాయకత్వం నుండి తొలగించేందుకు అతను భారత్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ తో కలిసి పని చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

           1995లో రెండు శ్రీలంక ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ లను సముద్రం లో దాడి చేసి ముంచేయడంతో ఘర్షణలు మళ్ళీ మొదలయ్యాయి.శ్రీలంక సైన్యం జాఫ్నాను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.మూడు సంవత్సరాలు ఎన్నో దాడులు చేసి ఉత్తర ప్రాంతంలో పెద్ద ప్రాంతాలను శ్రీలంక సైన్యం స్వాధీనం చేసుకున్నారు.1998లో ఎల్.టి.టి.ఈ. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.ఇది శ్రీలంక సైన్యం తో సుదీర్ఘ పోరాటం తర్వాత జాఫ్నా ద్వీపకల్పం వద్ద ఎలిఫెంట్ బేస్ కాంప్లెక్స్ ను ఏప్రిల్ 2000లో స్వాధీనం చేసుకోవడం తో ముగిసింది.

            2001 డిసెంబర్ లో అధికారంలోకొచ్చిన కుమారతుంగ మరియు రాణిల్ విక్రమ సింఘేల భారీ ఓటమి తర్వాత ఎల్.టి.టి.ఈ. ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించింది.శ్రీలంక ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించారు.2002లో కాల్పుల విరమణ 2004 లో కిలినోచ్చికి ఉత్తరాన ఉన్న ఎల్.టి.టి.ఈ. సైకిల్ పదాతిదళ ప్లటూన్ 2002 లో ఎల్.టి.టి.ఈ. ప్రత్యేక రాష్ట్రం అనే తన డిమాండ్ ను విరమించుకున్నారు.బదులుగా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ని కోరింది.మరియు 2002లో కాల్పుల విరమణ ఒప్పందం పై సంతకం చేసారు.నార్వే మరియు ఇతర నార్డక్ దేశాలు ఈ ఒప్పందానికి పర్యవేక్షించడానికి ఒప్పుకున్నాయి.

            ఎల్.టి.టి.ఈ. మరియు శ్రీలంక ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతుండగానే కొనసాగుతున్న శాంతి ప్రక్రియకు కొన్ని క్లిష్ట పరిస్థితులు అంటూ 2003లో ఎల్.టి.టి.ఈ చర్చల నుండి వైదాలిగింది.దాంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి.ఎల్.టి.టి.ఈ 2003లో మధ్యంతర స్వయం పరిపాలన అథారిటీ ని ప్రతిపాదించింది.దీనిని అంతర్జాతీయ సమాజం ఆమోదించింది.కానీ శ్రీలంక ప్రభుత్వం అంగీకరించలేదు.2005 లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ఎల్.టి.టి.ఈ. బహిష్కరించారు.

ఈలం యుద్ధం



               2005లో శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్సే ఎన్నికయ్యారు.శాంతి చర్చల నుండి LTTE తప్పుకుంది.చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.2006 ఏప్రిల్ 25న శ్రీలంక ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ శరత్ ఫోన్సెకా పైన హత్యాయత్నం చేసారు.దాంతో LTTE ని యురోపియన్ యూనియన్ తీవ్రవాద సంస్థ గా గుర్తింపు.

               జూలై 2006లో మావిల్ ఓయ జలాశయం స్లూయిజ్ మూసివేసారు.దాని కింద ఉన్న 15000 గ్రామాలకు నీటి సరఫరా ఆపివేశారు.ఆగస్టు 2006 నాటికి ఇది పూర్తి స్థాయి యుద్ధం గా మార్పు చెందింది.అదే సంవత్సరం శాంతి ప్రక్రియ దెబ్బ తిన్న తర్వాత శ్రీలంక ప్రభుత్వం పులుల పైన యుద్ధం  చేసి ఓడించి దేశం మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకుంది.



             2006 జూన్ 8 మరియు 9 తేదీల్లో శాంతి చర్చలు నార్వే లో షెడ్యూల్ చేయబడ్డాయి.కానీ ఎల్.టి.టి.ఈ. తమ యోధులని సురక్షితంగా లేదు అని చర్చలు  బహిష్కరించారు.2006లో ఇరు పక్షాల చేత అనేక కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగాయి.ఆత్మాహుతి దాడులు, సైనిక దాడులు మరియు వైమానిక దాడులు 2006 చివరిలో జరిగాయి.

             2007 నుండి LTTE పైన సైనిక దాడులు పెరిగాయి.2002 నుండి 2007 మధ్య శ్రీలంక మోనిటరింగ్  మిషన్ ఎల్.టి.టి.ఈ. మొత్తం 3830 కాల్పుల విరమణ నమోదు చేసింది.

              2008లో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ నుండి వైదొలిగింది.

కల్నల్ కరుణ(వినయగ మూర్తి మురళీధరన్ పేరు) సీనియర్ LTTE కమాండర్ LTTE నుండి విడిపోయి ఉన్ప్ పార్లమెంట్ సభ్యుడు సయ్యద్ అలీ జహీద్ మౌలానా ప్రోత్సాహం తో  మధ్య ఉత్తరాది కమాండర్లు తూర్పు  తమిళుల అవసరాలను పట్టించుకోవడం లేదు అనే ఆరోపణతో తమిళ్ ఈలా మక్కల్ విడుతులై పులికల్(తర్వాత తమిళ్ మక్కల్ విడుతులై పులికల్)ని స్థాపించారు.ltte మాత్రం అతను నిధులను సరిగా ఉపయోగించలేదని ఆరోపించారు.రెండు సంస్థల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

          TMVP కి ప్రభుత్వ మద్దతు ఉందని LTTE ఆరోపించారు.SLMM మానిటర్లు దానిని ధృవీకరించారు.మరోవైపు శ్రీలంక ప్రభుత్వం దాడులు చేస్తూనే ఉన్నారు.మే 19,2009 న ప్రభాకరన్ హత్య చేయబడ్డాడు.



          సెల్వరస పద్మనాథన్ ప్రభాకరన్ తర్వాత LTTE అధినేత అయ్యాడు.కానీ వారం లోపే మలేషియాలో పట్టుబడ్డారు.17 మే 2009న పద్మనాథన్ ఓటమిని అంగీకరించాడు.ఈ పోరాటం ఒక చేదు ముగింపు కి చేరుకుంది అని ఆయన పేర్కొన్నారు.



           595 బాల సైనికులతో సహా 11664 మంది సభ్యులు లొంగిపోయారు.

150 మంది హార్డ్ కోర్ సభ్యులు,1000 మంది మధ్య స్థాయి సభ్యులు భారత్ కి పారిపోయారు.

మానవ హక్కుల సంఘాలు  తమిళ ప్రజల పైన శ్రీలంక సైన్యం హత్యలు, అత్యాచారాలు చేసారని ఆరోపించారు.

LTTE అంటే ఏదో చిన్నగా ఒక ప్రభుత్వం పైన కోపంతో ఆవేశంగా తిరుగుబాటు చేసిన సంస్థ కాదు.

      ఇది చాలా చిత్త శుద్ధి తో ఒక సొంత సైనిక వ్యవస్థ ని ఏర్పాటు చేసుకుని, తమకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని దేశాల ప్రభుత్వాలతో పోరాడిన సంస్థ.అలాగని ఇది చాలా గొప్ప సంస్థ లేదా మంచిది అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం నా ఉద్దేశం కాదు.నేను వారి చిత్త శుద్ధి, నిరంతర కృషి,తమ సిద్ధాంతల పైన విధేయత గురించి చెప్తున్నాను.

         ఇది పొగాకు, మత్తు పదార్థాలు, వ్యభిచారం లాంటి వాటిని తమ యోధులకు అందకుండా చేసింది మరియు బహిష్కరించారు.

        తన సైనిక విభాగంలో సంప్రదాయ పోరాట దళాలు, ఛార్లెస్ ఆంథోనీ బ్రిగేడ్ మరియు జయంతన్ బ్రిగేడ్ లాంటి 11 విభాగాలను కలిగి ఉంది.అలాగే బ్లాక్ టైగర్స్ అనే ఆత్మాహుతి సంస్థ, సీ టైగర్స్ నావికా దళం, ఎయిర్ వింగ్ ఎయిర్ టైగర్స్,LTTE నాయకుడు ప్రభాకరన్ భద్రతాదళం ఇమ్రాన్ పాండియన్ రెజిమెంట్ మరియు రథా రెజిమెంట్,కిట్టు ఆర్టిలరీ బ్రిగేడ్, కుట్టి శ్రీ మోర్టార్ బ్రిగేడ్ లాంటివి ఉన్నాయి.

         విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి.వాటితో కూడా ఆత్మాహుతి దాడులు చేశారు.ప్రతి సభ్యుడు సైనెయిడ్ ని ఉంచుకొనేవారు.ఒకవేళ శ్రీలంక సైన్యానికి లేదా పోలీసులకు దొరికితే దాన్ని మింగి ఆత్మహత్య చేసుకోవాలి.వీరికి ప్రత్యేకమైన గూఢచారి విభాగం కూడా ఉంది.



        వీరి ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని నడిపించారు.పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లాంటివి ఉన్నాయి.స్త్రీల పైన గృహ హింసను కూడా చాలా మట్టుకు తగ్గించారు.శక్తివంతమైన అంతర్జాతీయ సంస్థని కూడా తయారు చేసుకుంది.

మొత్తం ఈ కథనం అంతట్లోని నన్ను బాగా కలిచివేసిన విషయం,మీతో ఇక్కడ వరకూ చెప్పని విషయం,అందరూ మర్చిపోయిన విషయం

      వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుడి మరణం.యుద్ధం అంతా అయిపోయింది.అసలు నాయకుడు హతమయ్యాడు.మిగిలిన వారు దొరికేసారు.కానీ ప్రభాకరన్ కుమారుడు చిన్న పిల్లాడు.వాడిని పట్టుకుని అందరి మధ్యలో బంధించి, ముందు వాడికి బిస్కట్లు ఇస్తే అమాయకంగా తిన్నాడు.కానీ అవి తిన్న తర్వాత చిన్న పిల్లాడనే కనికరం లేకుండా కాల్చి చంపేశారు.



          ఈ యుద్ధం లో ఎక్కడా తప్పని కానీ,ఎవరూ ఒప్పని కానీ నేను చెప్పను.కానీ ఈ పిల్లాడి విషయం లో మాత్రం శ్రీలంక సైనికులు చేసింది 100% తప్పే.ఆ ఫోటో చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను నిద్ర కూడా పోలేదు.ఎప్పుడూ ఆ చిత్రమే గుర్తు వచ్చేది.ఇప్పుడు ఈ ఆర్టికల్ రాయడానికి కూడా ఆ పిల్లాడి మరణమే కారణం.




ఓం శాంతి.......

ప్రపంచం లో శాంతి వర్ధిల్లాలి........

0 $type={blogger}